1, డిసెంబర్ 2011, గురువారం

వింజమూరి కళాఝరి

ఏ దేశ మేగినా ఎవ్వరెదురైనా... నిలపరా నీ జాతి నిండు గౌరవం... అన్న స్పూర్తిని మనసారా మదిలో నింపుకుని.. అమెరికాలో తెలుగులో ఏ కార్యక్రమం జరిగినా ఆ శ్రావ్యమైన గొంతు అతిధులను ఆహ్వానిం చాల్సిందే! తన శిష్యబృందంతో కల్సి అందెల సవ్వడి చేస్తూ...నాట్యమయూరిలా ఆనందింపచేస్తూ... స్వాగతం పలకాల్సిందే. అందలాలు ఎన్ని ఎక్కినా అన్నింటిని సమర్ధవంతంగా నెరవేరుస్తూ... ''తెలుగు వాణి''తో పాటు కూచిపూడితోనూ...తన మనసునే కాదు ఎదుటివారినీ ఉల్లాస పరుస్తూ.. సాగుతున్న వ్యక్తి వింజమూరి రాగసుధ.
కలకండ వంటి తియ్యని తెలుగు లండన్‌లో మాట్లాడుతూ, నవరస విన్యాసాలతో కూచిపూడి నాట్యఔన్నత్యాన్ని చాటుతూ, తెలుగు సాహితీ, సంస్కృతుల ప్రాభవ వింజామరలతో కళామతల్లిని అర్చిస్తూ జీవితాన్ని రాగరంజితం చేసుకున్న నృత్య, గాన మాధురి పరీవాహ ఝరి రాగసుధ వింజమూరి. అక్షరాన్ని అమృత కలశంగా, కళాహృదయాన్ని సుధా లాపంగా మార్చి అక్షర దీపాలతో స్వరలక్షణ హారతులందిస్తూ, చరణ మంజీర నాదాలతో నీరాజనాలందుకుంటోన్న సార్థక నామధేయురాలు రాగసుధ.
స్వరపదం తెలిసి, మానస సరోవరంపై హాయిగా తేలియాడే కలహంస ఆమె. పదవిన్యాసం గుట్టు తెలిసి సప్తకళావర్ణాల మధ్య నర్తించే మయూరం ఆమె. స్వరంలో పదం, శ్రుతిలో భావావేశం, వ్యాఖ్యానంలో రాగసుధలు ఆమెకు అబ్బిన సహజ లక్షణాలు. భావాలను, అనుభవాలను, ఆత్మీయతా సుగంధాలను రంగరించి తెలుగు పరిమళాలు వెదజల్లే రాగసుధ నీహారుల చల్లదనాల తెల్లదనానికి ప్రతీక. మమతాను బంధాలు, మకరంద సంశోభిత సుధలు కురిపిస్తూ, సాంద్రకళా చంద్రికలు ప్రకాశింపచేస్తూ తెలుగు ఘనకీర్తిని విదేశాలలో చాటుతోన్న కళామతల్లి ముద్దుబిడ్డ. లండన్‌ వెళ్ళిన తెలుగు రసజ్ఞులకు, కళాకారులకు ఆమెపేరు చిరపరిచితం. ఎక్కడ ఏ తెలుగు కార్యక్రమం జరిగినా రాగసుధ ఉండి తీరవలసిందే. ఆమె వ్యాఖ్యానమో, నాట్యమో అలరించవలసిందే. ఇదే ఆమె ప్రత్యేకత అయితే అంతగా చెప్పుకోనవసరం లేదు. అయితే ఆమె చాలామందివలే ఐటి చదువులతో ఆమె విదేశాలకు వెళ్లలేదు.
చిన్నప్పటి నుంచీ నాట్యమే ధ్యాసగా, తెలుగు భాషే శ్వాసగా, కళలే ఆశగా తండ్రి అభిరుచులకు అనుగుణంగా పెరిగింది. కళలపట్ల ఆరాధన, సాహిత్యం పట్ల విశేషమైన మక్కువగల కీర్తిశేషులు వింజమూరి శేషాచార్యుల కలల పంట రాగసుధ. అందుకే స్ఫూర్తీభవించిన సాంస్కృతిక రసపోషణలో కళాప్రమోద దరహాస సురభిళాలతో, సులలిత మనోజ్ఞ భావాలతో పెరిగింది. భారతీయం రంగరించిన తెలుగు కళాసాంస్కృతిక వికాసమే వృత్తిగా, ప్రవృత్తిగా భావించింది. చిన్నప్పటి నుంచే నాట్యాన్ని మంచి గాత్రంతో రాగసుధలు ప్రసరించే ప్రసంగాల్ని అభ్యసించింది.
అందుకే రాగసుధ లండన్‌లోని తెలుగు రేడియోలో ప్రసంగాలు చేస్తున్నా, కార్యక్రమాలకు వ్యాఖ్యానం చేస్తున్నా మాటల మంత్రనగరిలో ద్వారాలు తెరిచినట్టు, చెట్టు చెట్టు నుంచి పట్టు తేనెలు పట్టుకొని పిండినట్టు, స్వర స్వర్గ విపినంలో మాధవుని మోహన మురళికి తరులన్నీ విరిసినట్టు, మంగళకైశికి, భూపాల రాగాలు మురిసినట్టు ఉంటాయి. లండన్‌లో తెలుగు కార్యక్రమాలు ఉన్నాయంటే చాలు ఇంట్లో ఏదో శుభకార్యానికి తానే అన్ని అయి నిర్వహించాలన్నంత హడావిడి పడిపోతుంది రాగసుధ. ఎటువంటి బృహత్తర కార్యాన్నైనా, మహత్తర బాధ్యతనైనా అలుపూ సొలుపూ లేకుండా నిర్వర్తించగల చాకచక్యం, ఓర్పు, నేర్పు ఆమెకే సొంతం స్వోక్తికీ, స్వోత్కర్షకీ, స్వాతిశయానికి అతీతమైన మనస్తత్వం, సౌమ్యత, సౌకుమార్యం పుణికి పుచ్చుకున్న పరిణిత వ్యక్తిత్వం. అందుకు రాగసుధ మంచి కళాకారిణి కాగలిగింది.
వ్యాఖ్యానంలో భావ ప్రకటన, భాషాలాలిత్యాలపై అదుపు, పొదుపూ, పట్టు తెలుసుకున్న 'గళాకారిణి'. పంచరంగుల ప్రపంచాన్ని, సప్తవర్ణాల జీవితాకాశాన్ని, నవరసాల జీవితాన్ని, జీవితోద్యానంలో ఆత్మానందాన్ని కలిగించే అతసీకుసుమాల్ని, గుండెలు కరిగించే సన్నివేశాల్ని, నరనరాన ఉత్కంఠ రేపే ఘటనల్ని మాటలతోనే సాక్షాత్కరింపజేయగల నేర్పు ఆమె వ్యాఖ్యానానికి ఉంది.
ఇక నాట్యం సంగతికి వస్తే డా|| ఉమారామారావు శిష్యురాలిగా మాత్రమే కాక తనదైన ముద్రకోసం తపించే సృజనశీలి రాగసుధ. ఆమె నాట్యంలో శంపాలతల మెరుపు, పాలపుంతల మోహరింపు ఒక వినూత్న శోభ. రసార్ద్ర నయనాంచలాలలో వింతకాంతులు వెదజల్లుతాయి. నాట్యమే వేదంగా, నిజజీవన నాదంగా, పండిత పామర జనామోదంగా ఉంటుంది.
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో నృత్య విభాగపు అధిపతిగా పనిచేస్తున్న రోజుల్లో ఉమా రామారావుగారి వద్ద శిష్యరికం చేశారు రాగసుధ, అలా ఆమె నేర్చుకున్న కళకు తనదైన శైలిలో పదును పెడుతూ స్వల్ప వ్యవధిలోనే మంచి డాన్సర్‌గా ఎదిగారు.
వృత్తిలోనూ ప్రశంసలే... భారత దేశంలో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనని తాను నిరూపించుకుంటూ భారత పర్యాటక రంగంలో పనిచేసి, ఆపై అంతర్జాతీయ పర్యాటక శాఖ కన్సల్టెంట్‌గా చేరారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మన హైదరాబాద్‌లో తొలిసారిగా నిర్వహించిన ఏఫ్రో ఏషియన్‌ గేమ్స్‌కు లైసెన్స్‌ అధికారిగా బాధ్యతలు స్వీకరించి... అద్భుత మైన పనితీరుతో అంతా ఆశ్చర్యపోయేలా నిర్వహించి... నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అనేకమంది ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం లండన్‌లో పర్యాటక శాఖలో అధ్యాపకురాలిగా పనిచేస్తూ... జట్‌ ఎయిర్‌వేస్‌, ఎయిర్‌ సహారా లాంటి అంతర్జాతీయ విమాన సంస్థలలో పనిచేసేవారికి ట్రావెలింగ్‌ పై శిక్షణ ఇస్తూనే... శ్రీలంక ఎయిర్‌లైన్స్‌, సిల్క్‌ ఎయిర్‌, ఎమిరేట్స్‌ సంస్థలకు... మన రాష్ట్ర పర్యాటక శాఖలో జరిగే అనేక ప్రమోషనల్‌ కార్యక్రమాలకు ప్రత్యేక సలహాదారుగా సేవలందిస్తున్నారు.
లండన్‌లో తెలుగు గుబాళింపులు : లండన్‌లో జరిగే ప్రతి తెలుగు వారి సాంస్కృతిక కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తెలుగుదనం గుబాళింపులు అద్దుతూ వింజమూరి 'తెలుగు'కు చేస్తున్న సేవపై ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ప్రశంసలు అందుకుంటున్నాయి. తానా, ఆటా వంటి సభలకు కమ్మనైన తెలుగు పదాలతో నిండుదనం తేవటమే కాకుండా... తన శిష్యబృందంతో కలసి ఇచ్చే ప్రదర్శనలు విలక్షణంగా ఉంటాయి.
రాగసుధ తెలుగుదనానికి, నృత్య రీతులతో చేస్తున్న సేవలని తానా పత్రిక, యుకెలోని వజ్రం లాంటి స్థానిక పత్రికలు, మన భారతదేశంలోని వివిధ పత్రికల రైటప్స్‌, మీడియా సంస్థల ప్రసారాలు.. మారిషస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌లో ఇంటర్వ్యూ ప్రసారం కావటం తనకో మధురానుభూతి స్ఫూర్తి అంటారు.
పురస్కారాలు... : ఇండో -శ్రీలంక కల్చరల్‌ వారిచే 'అవుట్‌ స్టాండింగ్‌ యంగ్‌ పెర్ఫార్మెన్స్‌' అవార్డు అమెరికాలోని తెలుగు సంఘాల ప్రత్యేక ఉగాది పురస్కారాలు భారతీయ కళా సమితి 'అభినయ ప్రవీణ' పురస్కారం స్వర్గీయ కృష్ణకాంత్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు రాజ్‌భవన్‌లో ప్రత్యేక నృత్య రూపక ప్రదర్శన న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో అశేష ప్రజల నడుమ చేసిన నృత్య రూపకం రాష్ట్ర పర్యాటక శాఖ తరఫున హిమాచలప్రదేశ్‌లో 20 రోజులపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు. దక్షిణాది సాంస్కృతిక పీఠం సారథ్యంలో ఏటా నాగపూర్‌లో జరిగే 'డాన్స్‌ ఫెస్టివల్‌'లో పాల్గొని దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ సమక్షంలో ప్రదర్శన.
భారత్‌, బ్రిటన్‌లలో తితిదే ధార్మిక మండలి సారథ్యంలో నిర్వహించిన వైతాళికుడు అన్నమాచార్య 600, 601 పుట్టిన రోజు వేడుకల్లో పాల్గోవటం జర్మనీ -పిట్స్‌బర్గ్‌లో ఉన్న గోథే ఇనిస్టిట్యూట్‌లో ఇచ్చిన ప్రదర్శన వంటివి కొన్ని ఆమె ప్రతిభకు ఉదాహరణలు.
'శ్రీనివాస గద్యం' నృత్యరూపకం : శ్రీశైల రంగాచార్యులు రచించిన 'శ్రీనివాస గద్యం' నృత్యరూపకంగా మలిచారు. ఏడుకొండల ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా... 'నాద నీరాజనం' చేస్తూ... దశావతారాలను కూచిపూడి నృత్యరీతిలో కళ్లకు కట్టేలా ప్రదర్శనలిస్తున్నారు. తన కూచిపూడి గురువు ఉమారామారావు సారథ్యంలో నృత్యరీతుల్ని సమకూరుస్తూ.. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు శెట్టిరాజు వేణుమాధవ్‌ సహాయంతో ఈ గద్య రూపకానికి ప్రాణప్రతిష్ట చేసారామె. తిరుపతిలోని ప్రతికొండని, నీటి సొరుగులని, పుష్పాలని నృత్య అభినయంతో అందర్నీ ఆకట్టుకునే రీతిన సాగే 30 నిముషాల నిడివి గల ఈ రూపకాన్ని ప్రదర్శిస్తున్నారామె.
దేశం వీడినా... : ఏడేళ్ల క్రితం 'సుధ' తెలుగు రాష్ట్రం నుంచి యుకె పయనమయ్యారు. లండన్‌లో స్థిరపడినా తెలుగు సంస్కృతిని వీడలేదు. పైగా తెలుగు సాంస్కృతిక ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కంకణ బద్ధులయ్యారు. ఒకవైపు అధికారిణిగా బాధ్యతలు ప్రశంసలందుకునేలా నిర్వహిస్తూ... మరోవైపు భారత నృత్య కళాకారిణిగా అనేక ప్రదర్శనలు ఇచ్చారామె. భారత శాస్త్రీయ నృత్య 'కళ' అంతరించపోకూడదనే ఉద్దేశ్యంతో లండన్‌లోని బర్మింగ్‌హామ్‌ బాలాజి టెంపుల్‌, మహారాష్ట్ర మరాఠా మండల్‌లోనూ... మాంచెస్టర్‌ భారతీయ విద్యాభవన్‌లతో పాటు తన ఇంటి వద్ద కూడా తెలుగు వైభవం, కూచిపూడి నృత్య శిక్షణ ఇస్తు అక్కడ భారతీయుల నడుమ వారధిగా నిలుస్తు అనేక మంది ఔత్సాహిక భారతీయ విద్యార్థులకు నృత్య రీతుల్ని తర్ఫీదు ఇస్తూ... డాన్స్‌ అధ్యాపకురాలిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈమె తన దగ్గర శిక్షణ పొందిన చిన్నారులతో లండన్‌లోని వివిధ ప్రాంతాలలో ప్రదర్శనలు ఇస్తున్నారామె.
అలాగే తెలుగు భాష గొప్పదనం, సంస్కృతి, సంప్రదాయం, ఔన్నత్యాలపై జరిగే అనేక చర్చా వేదికల్లో తన గళం వినిపిస్తూ తెలుగు విశ్వవ్యాప్తం చేసేందుకు అవిరళ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో నివాసముంటూ తెలుగుభాష నేర్చుకోవాలన్న తపన ఉన్న అనేకమందికి తెలుగుభాష నేర్పిస్తూ... సరళీకృత విధానంలో భాషపై అవగాహన పెంచుకునేలా వారిని తీర్చిదిద్దుతున్నారు.
కవయిత్రిగా : తన అనుభవాలని రంగరించి 'రాగసుధ' రాసిన కవిత్వం వివిధ పత్రికల్లో ప్రచురితమైంది. వంగూరి ఫౌండేషన్‌, అమెరికావారు నిర్వహించిన అంతర్జాతీయ కవితల పోటీలో బహుమతి గెలుచుకుంది. ఇలా వివిధ పత్రికల్లో ప్రచురితమైన తన కవితలు, స్వీయ రచనల్ని... 'కవితా రాగసుధ' పేరిట బాపు గీసిన ముఖచిత్రంతో ఓ సంకలనంగా వెలువరించారు.
లక్ష్యం : మోహిని యాట్టం, కథకళి, కథక్‌ ఇలా డాన్స్‌ ప్రక్రియలన్నింటినీ కలగలిపి... ఒక విలక్షణ నాట్యప్రక్రియ రూపొందించడం తన ధ్యేయం అంటారు రాగసుధ. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న గురజాడ అడుగుజాడను ఆచరించి చూపుతోన్న తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ వింజమూరి రాగసుధ.